ఇన్‌స్టాగ్రామ్ 'గ్రేట్ పర్జ్'.. ఒక్కరోజే కోట్లలో ఫాలోవర్లు మాయం.. సెలబ్రిటీలకు షాక్!

  • ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్, ఇనాక్టివ్ ఖాతాల భారీ తొలగింపు
  • సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్ల ఫాలోవర్ల సంఖ్యలో భారీ కోత
  • కైలీ జెన్నర్ ఒక్కరే 14 మిలియన్ల ఫాలోవర్లను కోల్పోయిన వైనం
  • ఇది సాధారణ ప్రక్రియేనని స్పష్టం చేసిన మాతృసంస్థ మెటా
  • ఈ పరిణామంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2026 సంవత్సరానికి గానూ భారీ క్లీనప్ డ్రైవ్ చేపట్టింది. ఇందులో భాగంగా లక్షలాది బాట్ (నకిలీ), ఇనాక్టివ్ (క్రియాశీలంగా లేని) ఖాతాలను తొలగించింది. ఈ చర్యతో ప్రపంచవ్యాప్తంగా ఎందరో సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, బ్రాండ్ల ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా భారీగా పడిపోయింది.

పాప్‌బేస్ నివేదికల ప్రకారం.. ఈ క్లీనప్ ప్రభావం అనేకమంది ప్రముఖులపై పడింది. అమెరికన్ సోషల్ మీడియా స్టార్, వ్యాపారవేత్త కైలీ జెన్నర్ ఏకంగా 14 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కోల్పోయారు. ఆమెతో పాటు మరెందరో ప్రముఖుల ఫాలోవర్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఈ పరిణామాన్ని నెటిజన్లు "గ్రేట్ పర్జ్ ఆఫ్ 2026"గా అభివర్ణిస్తున్నారు.

ఈ పరిణామంపై ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ప్రతినిధి స్పందించారు. ఇది ప్లాట్‌ఫామ్‌లో ప్రామాణికతను పెంచేందుకు తాము చేపట్టే సాధారణ ప్రక్రియేనని తెలిపారు. "క్రియాశీలంగా లేని ఖాతాలను తొలగించడం వల్లే కొందరి ఫాలోవర్ల సంఖ్యలో మార్పులు కనిపించాయి. నిజమైన, యాక్టివ్ యూజర్లపై ఎలాంటి ప్రభావం లేదు" అని ఆయన స్పష్టం చేశారు.

ఆసక్తికరంగా ఈ క్లీనప్ డ్రైవ్‌లో ఇన్‌స్టాగ్రామ్ అధికారిక ఖాతాకు కూడా మినహాయింపు లభించలేదు. ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్ ఖాతా సైతం దాదాపు 9 మిలియన్ల ఫాలోవర్లను కోల్పోయిందని సోషల్ మీడియాలో యూజర్లు స్క్రీన్‌షాట్లతో సహా పోస్టులు పెడుతున్నారు.

Instagram
Instagram Great Purge
Kylie Jenner
Social Media
Meta
Social Media Influencers
Fake Followers
Inactive Accounts
Instagram Followers
Social Media Clean Up

More Telugu News